schedule Saturday, June 13, 2026

ఉపాధ్యాయుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి

calendar_today December 31, 2024
person meenewstelugu

ఉపాధ్యాయుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 30::::::తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు తీకుళ్ళ సాయి రెడ్డి ఉపాధ్యాయల, పెన్షర్స్ సరేండర్ లీవ్ బిల్స్, జి.పి.ఎఫ్, మెడికల్ బిల్స్ గత రెండు సంవత్సరాలుగా చెల్లించకపోవడం విచారకరమని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పూర్వ అధ్యక్షులు తీకుళ్ళ సాయి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ చర్యలను తిట్టిపోసి ప్రభుత్వం లోకి వచ్చిన ఈ ప్రభుత్వం నేడు గత ప్రభుత్వం కన్నా అద్వానంగా వ్యవహరిస్తుందనీ ఆయన ఆరోపించారు. సర్వీసులో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సమర్పించిన బిల్లులు రిటైర్ అయ్యాక కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేక పోతుందనీ వివరించారు. రిటైర్డ్ అయ్యాక వచ్చే డబ్బుతో పిల్లల పెళ్లి చేయాలని, ఇల్లు కట్టుకోవాలని, బ్యాంక్ లోన్స్ చెల్లించాలని చేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యి పెన్షనర్స్ పరువుపోతుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం లోకి రాక ముందు చెప్పిన మాటలన్నీ నీటిమీద రాతలయ్యాయనీ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అన్ని డి.ఎ. లు ఇచ్చినప్పటికిని, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డి ఎ లు పెండింగ్ లో పెట్టడం చాలా అన్యాయం అన్నారు. ఇక పి.ఆర్.సి గూర్చి, ఇతర పెండింగ్ సమస్యలగూర్చి మాట్లాడే పరిస్థితే లేదనీ వాపోయారు. విద్యారంగం పూర్తిగా సమస్యలతో సతమతం అవుతుందనీ, ఇరవై రోజులుగా ఉద్యమాలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను కనీసం చర్చలకు కూడా పిలవకుండా నిర్లక్ష్యం చేయడం సబబుకాదనీ వివరించారు. దీనితో వేలాదిమంది కె.జి.బి.వి. విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనీ, ముఖ్యమంత్రి వారి పనిలో బిజీగా ఉన్నారనీ ఎద్దేవా చేశారు. పెన్షనర్స్, ఉపాధ్యాయులు పెండింగ్ బిల్లులకోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బిజీ లో ఉన్నారనీ, విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల గూర్చి చర్చించడానికి, మానవ వనరుల నిర్మాణం చేసే విద్యాశాఖకు కనీసం ఈ రాష్ట్రం లో విద్యామంత్రి లేకపోవడం కడు శోచనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెన్షనర్స్ కు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎస్.ఎస్.ఎ. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రిని సాయి రెడ్డి డిమాండ్ చేశారు.