schedule Wednesday, August 26, 2026

అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలి

calendar_today December 21, 2024
person meenewstelugu
అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలి

అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలి

 

          కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 20::::: పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అనే మాటను ఉచ్చరించటం ఫ్యాషన్ అయిపోయింది అని, దీనికి బదులు రామనామ స్మరణ చేస్తే ఏడు జన్మల ముక్తి లభిస్తుందని పేర్కొనటం, అంబేద్కర్ ను అవమానపరచటమే కాక, హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే అవుతుందని అన్నారు. కేంద్ర మంత్రులు మొత్తం హిందూ మతాన్ని రెచ్చగొడుతూ దేశాన్ని లౌకిక రాజ్యాంగం నుండి హిందూ రాజ్యాంగంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పార్లమెంటులో దొడ్డిదారిలో ప్రవేశపెడుతున్న బిల్లులు ఆమోదం పొందడం కోసం ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి, అసలు విషయాన్ని పక్కకు నెడుతున్నారని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానం పార్లమెంటులో ప్రవేశపెట్టే సందర్భంలో దేశంలో ప్రతి ఒక్కరు ఇది రాజ్యాంగ విరుద్ధమని నిరసన తెలియజేస్తున్న క్రమంలో దానిని పక్కదారి పట్టించడం కోసం అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు. ఏ వ్యక్తి చేత రాజ్యాంగం రాయబడిందో ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఆ రాజ్యాంగ కర్తను అవమానపరచడం, కచ్చితంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అమిత్ షా పై దేశద్రోహు కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.అమిత్ షా రాజీనామా చేసేంత వరకు దేశవ్యాప్తంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న,పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నరసయ్య,పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఎస్కే సయ్యద్, చిత్తలూరి లింగయ్య, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి మోటకట్ల జయమ్మ,ఐతరాజు పద్మ,శంకర్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.